Monday, November 1, 2010

శోధన




సాక్షి ఆదివారం(24/10/10) ఫన్డేలో ప్రచురితమైన కవిత.



నశ్వరం

నీ కనురెప్పల సవ్వడితో
కటిక చీకట్లను తరిమి
నీ లేలేత కిరణంతో
నింగికి ఉదయవర్ణం పులిమి
నీ ఆలోకనం తో
లోకంలో కోలాహలం రేపి
నేనే రాజ్యాలకు రాజంటూ
రోజంతా నెత్తెక్కుతావు.
నీపై ప్రేమ పొంగి
కారు మేఘం కరిగి
వలపుల కులుకులు కురిసిందని
సప్తవర్ణ సంతకం చేసావు.
నీ తాపం తట్టుకోలేక
నీలాకాశం నడిసంద్రంలో మునకేసి
నీలాంబరాలు నీటికి అరువిచ్చిందని
కాషాయం ఓని ఓడి, ఎరసంజ సాంబ్రాణి వేసావు.
తొలి దిక్కును కవ్విస్తూనే
మలి దిక్కుతో జత చేరి
నిలకడలేని నువ్వు
నీతోపాటే...
పూసిన రంగులన్ని మూటకట్టుకెల్తు
నీ ఈలోకాన్ని అంధతమసం చేసావు.
రెప్పపాటి కాంతులు
గుప్పెట్లో ఎరగా పట్టి
మరో కొత్త రోజుతో మళ్ళీ వస్తావు,
అహస్సు తమస్సుల కలయికలో
నిషస్సులు ఉషస్సులు సహజమంటూనే 
 అంతా నశ్వరం అంటూ...

కౌముది అక్టోబర్ సంచికలో ప్రచురితమైన కవిత.
 
 

ఆత్మ ఘోష

నువ్వాడే నాటకంలో
నీ అంతరంగానికే పరిమితమైన
ఓ కీచురాయి పాత్రను

నువ్వు చేస్తున్న కర్మల్లో
కోల్పోయిన నా ఉనికిని శోధిస్తూ
గుండె తడారిపోయి తపిస్తున్న అస్తిత్వాన్ని

నువ్వేస్తున్న బొమ్మల్లో
రూపాంతరం చెంది
ఆనవాలు పట్టలేని అదృశ్య చిత్రాన్ని

నువ్వు రాస్తున్న కథల్లో
కనుమరుగైన సత్యాన్ని,
నువ్వు పలికే పైమినుకు మాటల ఇరుకుల్లో
ఊపిరాడని ఉపేక్షిత గీతాన్ని

అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా…

ఒక్కసారైనా
నన్ను నువ్వుగా లోకానికి పంచు,
నువ్వు నువ్వుగా జీవించు
ఈ అలంకారాలన్నీ వొలిచి.

ఈ మాట  సెప్టెంబర్ 2010 సంచికలో ప్రచురితమైన కవిత.
 

Friday, August 20, 2010

నిర్లిప్తత

గుత్తులు గుత్తులుగా విరగబూస్తున్నాయి
ఆలోచనలు.
కాయలుగా ఎదిగేవి కొన్నే

ఉండలు ఉండలుగా ఎగిసిపడుతున్నాయి
పదసమూహాలు.
గుండెకు తాకేవి కొన్నే

గుంపులు గుంపులుగా పుడుతున్నాయి
పుట్టగొడుగులు.
మనిషిగా మిగిలేవి కొన్నే

Friday, August 13, 2010

ఎదురు చూపు

నీ తలపు
ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని
ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది

నీ ద్యాస
స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను
గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది

నీ ఊహ
మొగ్గలాముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి
అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది

నువ్వొస్తావన్న ఆశ

నిశ్చల నీలి సంద్రంలా నిద్దరోతున్న నా మదిని
ఊరించే కోరికల పెను ఉప్పనలో ముంచెత్తుతుంది

ఇదిగో, కాలం వదిలివెళ్ళిన జ్ఞాపకాల నీడల్లో
నీకై ప్రతీక్షించే నాకు వృద్దాప్యం వచ్చిన అలికిడే వినిపించలేదు
నీ ప్రేమే ప్రేరణై
నీ తలపే ప్రాణమై
నీ ఊసే ఉపలాలితమై
తన ప్రతీ స్పందనలో నీకై పరితపించే నా గుండెకు
ఇంకా ఆశల కొనఊపిరిలూదుతూనే ఉన్నా

పొద్దులో ప్రచురితమైన కవిత.

------------------ * -----------------------