Sunday, February 22, 2015

శబ్దాల చుట్టూ రూపు కట్టిన అనుభవం “దూప” - ఎం.నారాయణ శర్మ

సృజనావసరం (creative necessity) అనేదాన్ని ప్రేరేపించే అంశాలు రెండున్నాయి.
1.సమాజం 
2.స్వీయ జీవితం.
మొదటిది నిబద్ద సృజనకి రెండవది తాత్విక కళాసృజనకి సంబందించినదని ఉరామరికగా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఈరెంటి మూలంగా జరిగే సంఘర్షణ.ఇందులో సృజనకి ఉపయోగించే పరికరాల్లోనూ వైరుధ్యాలున్నాయి. వీటిని స్థూలంగా సంప్రదాయికాలు,ఆధునికాలు,వైయక్తికాలు అని విభజించవచ్చు.సంప్రదాయానికి శాస్త్రీయత, ఆధునికానికి దార్శనికత,వైయ్యక్తికంలో ఈరెంటినీ మేళవించి ఒక కొత్తదనాన్ని సాధన చేయటం కనిపిస్తుంది.ఈ శతాబ్దిఉత్తరార్థంలో సృజన సంబంధ అంశాలమీద “మనోఙ్ఞానిక భూమిక” ఒకటిచేరివ్యక్తి అంతశ్చేతనలో ఉండేఅనేకాంశాలని ఊతంగాచేసుకుని అభివ్యక్తిని పదును పెట్టింది. అభివ్యక్తి ధర్మాలు,ప్రవర్తనల గురించి జరగాల్సిన చర్చలు,విశ్లేషణల విషయంలో విమర్శ కవిత్వం కన్నా వెనుకబడి పోయిందని అందరూ చెప్పుకునేదే. ఈమధ్యలో పదాలకుండే అర్థపరమైన ఉనికిని కొంత ప్రత్యేక దృష్టితో(బహుశః ఉపయోగార్థంతో సాహిత్యావసరాలు తీరక)అర్థపరంగా వైశాల్యాన్ని పెంచిన సంధర్భాలున్నాయి. ఈ విషయంలో భాషా శాస్త్ర పరిధిలో కొంత చర్చ తెలుగులో కనిపిస్తుంది కాని,సాహిత్య ముఖంగా అనుమానమే. అంగ్లంలో ఈ పనిని ఐ.ఏ.రిచర్డ్స్ చేసారు. తన మిత్రుడు c.k.ogdan తో కలిసి 1923 కాలంలో “The meaning of the meaning”అనే పుస్తకాన్ని రాసారు. శబ్దాలచుట్టూ రూపుకట్టిన అనుభవ సత్యాలుంటాయి. కవిత్వంలో కనిపించే ఇలాంటి శక్తిని ఎఫ్.ఆర్.లీవిస్ “The explanatory creative use of words upon experience” అన్నాడు.
రవి వీరెల్లి తన అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలను మరమ్మత్తు చేసుకుని వాటి వైశాల్యాన్ని పెంచి ఉపయోగిస్తున్నారు.”దూప” సంపుటిలో కనిపించే ఆవృత్తి,దూపలాంటి అనేక పదాలు అలాంటివే. రవి వీరెల్లి కవిత్వంలో కొన్ని అంశాలను గమనించవచ్చు.
1.భౌతికతకి ఆంతరికతకి మధ్యన కనిపించే సంఘర్షణ.ఇందులో అనేక సార్లు ఒకే ప్రారంభాన్ని ఒకే ముగింపుని అనుభవిస్తారు.ఇలా రెంటిలోకి ప్రయాణిస్తారు.
2.తాననుభవించే వర్తమానంతోపాటు తనకు దూరంగా ఉండే వర్తమానాన్ని,దానికి మూలంగా ఉండే గతాన్ని అంతే సారవంతంగా అనుభవిస్తారు.
3.ఆధునికతని పులుముకుని వచ్చిన ప్రాంతీయ పదజాలం(preventialism),అర్థ పరంగా వైశాల్యాన్ని పెంచుకున్న పదాలు.వాటిలోంచి వెలువడే కళాధార్మికత-ఇవన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి.
”ఊహు!ఆకారంలేని పదాలు/పద్యానికి పనికిరావు”-(ఏం రాస్తాం-42పే.)
“ప్రాణ స్థానం లోతుల్నించి/పదాలు తోడి మనో ఫలకం పై చిలుకరిస్తూ/నీకు నువ్వే మేలుకొల్పు పాడుకో”-(పైదే) ఈ అసంతృప్తినించే పదాల కొత్త జీవాన్ని అన్వేషిస్తారు.ఇందుకోసం రవి పొందే అనుభవాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎడ్వర్డ్ బుల్లో Physical Distence(భౌతికాంతరత)ను ప్రతిపాదించాడు. రసానుభూతిలో ఉన్నప్పుడు ఉపయోగంతో పెద్దగా సంబంధం ఉండదు. వర్షంలో తడుస్తూ దానివల్ల కలిగే బాధనుమరిచి దాన్ననుభవించడమే రసమయస్థితి.ఈ స్థితిలో రవి తనకు కావల్సినదాన్ని వెదుక్కుంటారు.

“కళ్లు పగిలి/ఎప్పుడు భళ్లున తెల్లరిందో/కొత్త రెక్కలతో అస్తిత్వపు మూలాలు వెదుక్కుంటూ/తిరిగి విశ్వాంతరాల్లోకి నేను”-(ఆవృత్తి-18పే)
“ఓరోజు చెట్టుకు నిప్పంటుకుంది/ఆ అగ్నికీలల గర్భంలో దాగిన/గూడును వెదుక్కుంటూ/తిరిగి వెళుతున్న ఆత్మని చూస్తూ/బూడిదై/నేను”-(విముక్తి-13పే.)


నిర్దిష్టంగా రవి అనుభవిస్తున్నదిదే. గమనించాల్సిన మరో అంశం అభివ్యక్తిలో నున్న సౌందర్యారాధన.ఈ సౌందర్యం కోసం మళ్లీ మళ్లీ ఆలోచనలు చేస్తారు.సంజీవదేవ్ సౌందర్య వివేచనలో రససిద్దిని గురించి ఉటంకించారు. ప్రకృతివస్తువులోని భౌతికాన్ని,తాత్వికాన్ని కాకుండా భౌతిక కాంతిలో మెరిసే తాత్విక ధారని అనుభవించడం “రస సిద్ది”.ఇది తాత్విక స్థాయికంటే సౌందర్యాత్మకమయింది.భౌతికాంతరతలోని రసదృష్టిని రవి ఈదృష్టితోనే అనుభవిస్తారు.అందువల్లే రవిలో కొన్ని సార్లు సంఘర్షణ,మరికొన్ని సార్లు సౌందర్యం కనిపిస్తాయి.సంఘర్షణని చిత్రిస్తున్నప్పుడు కర్మ,ఆవృత్తి,నశ్వరం, ఆత్మ లాంటి ఒక అర్థ క్షేత్రానికి చెందిన పదాలవల్ల కొన్ని వాక్యాలు వేదాంతాన్ని పులుముకున్నాయి.

“నువ్వు చేస్తున్న కర్మల్లో/కోల్పోయిన నాఉనికిని శోధిస్తూ/
గుండే తడారిపోయి/తపిస్తున్న అస్తిత్వాన్ని”-(నాలో నేను-14పే.)

ఈకవిత్వంలో చాలాసార్లు ఉదయపు వర్ణనలున్నాయి.తన దృష్టికి దగ్గరగా ఉండటం వల్లేమో వీటి సంఖ్య ఎక్కువ.ఇందులోనూ సౌందర్యం ఎక్కువ కనిపించినా తత్వదృష్టే ప్రధానమైనది.

“వెలుగు చోరబడని/చర్మపు గోడలలోపల చిక్కుపడ్డ/ఓ చీకటి మూటను విప్పుతూ/ఒంటరిగా నేను”-(శోధన-17పే.)

“పడమటి కొండల్లో కోసిన/వెలుగుపంటే/తూర్పు కల్లంలో పైకెత్తి తూర్పాలపడుతూ/సూర్యుడు”-(నేను ఉదయం-30పే.)

“పక్క పొర్లించి పొర్లించి/అప్పుడే నిద్ర లేచిన పుడమికి/
తూర్పుకొళాయి వెలుగు నీళ్లతో/శ్రద్ధగా లాలపోస్తుంది”-(కాలం చివర-32పే.)

“తూరుపు తల్లి రెక్కల కింద/విదిగిన వోవెలుగు పిల్ల/
తల చిట్లిస్తూ/అరమూసిన కళ్లలో అప్పుడే నిద్ర లేసినట్టుంది”-(కాలంకింది గూడు-38పే.)

“దివికి భువికి మధ్య దూరన్నికొలుస్తూ/ఓ వెలుగు కిరణం
విచ్చుకుంటుంది/ఓ చీకటి ముద్ద ముదుచుకుంటుంది”-(కొలమానం-61పే.)

చీకటికొసలు వొడిసిపట్టి/కొలన్లో వుతికి/నేలపై అక్కడక్కద ఆరేస్తూ వెయ్యి/వెలుగు చేతులు”-(ఖాలీతనం-63పే.)

“కొండ రాళ్లను పెల్క్లగించుకుని/వొళ్లంతా మండుతున్న ఎర్రటి గాయాల కళ్లతో/పొద్దు పొడుస్తావు”-(ఇగవటు సూరన్న-67పే.)

“నేలంతా సీసం పోసినట్లు/వెలుగు ఫెళ్లున పగులుతుంది”_(ఇక్కడ- 69పే)

అన్ని వాక్యాల్లోనూ వెలుగు పట్ల ఓ సంఘర్షణ కనిపిస్తుంది.”చిక్కుపడటం,తూర్పాలపట్టదం,పొర్లించడం,తల్ అచిట్లించడం,ముడుచుకోవడం,వొడిసిపట్టడం,పెల్లగించడం.ఫెళ్లున పగలడం”లో ఇది వ్యక్తమౌతూ వుంటుంది.భౌతికంగా తెర మాటున తచ్చాడుతూ ఏదో ఆత్మిక సంపదని వెలిగక్కుతారు. రవి వీరెల్లి భాషలో రెండు భాషారూపాలున్నాయి. ఒకటి చాలాతక్కువగ కనిపించే వేదాంత పరిభాష. రెండవది జీవత్వం సంచలించే తెలంగాణా భాష. పరకాయించి, కల్లం, చూరు, మండి, ఓనగాయలు, మోడువారటం, పెయ్యి, పైలంగా, అలపటదాపట, సవారి కచ్చురాలు లాంటివి మరికొన్ని ఎత్తి రాయొచ్చు.


రవివీరెల్లి కవిత్వం వెనుక నిర్దిష్టమైన సాధన కనిపిస్తుంది.కవిత్వం కోసం కుదుర్చుకున్న చూపు, పట్టుకున్న పరికరాలే రవి వీరెల్లిని ప్రత్యేకంగాచూపుతాయి.

-ఎం.నారాయణ శర్మ
AUGUST 21, 2013 

కదిలించే కలాలు