Showing posts with label వ్యాసాలు. Show all posts
Showing posts with label వ్యాసాలు. Show all posts

Tuesday, September 18, 2012

ఒక్కో పద్యం ఒక్కో పొద్దుపొడుపు

"రాయడం అనే పని మానవ మాత్రులు చేసేదే, నేను మానవుడిని గనుక నేనూ రాయగలనని..."
మొన్నీమధ్య పొద్దు అంతర్జాల పత్రికలో వచ్చిన వొక ఇంటర్వ్యూ లో హెచ్చార్కె గారు చెప్పిన మాట ఇది. ఎంత మంచి మాట! కొత్తగా రాయాలనుకునే వాళ్లకు కావలసినంత inspiration దొరుకుతుంది ఈ మాటల్లో. ఈ ఇంటర్వ్యూ చదివాక హెచ్చార్కె గారి పద్యాలు మరిన్ని చదవాలనే కోరిక పుట్టి  మధ్యే "వానలో కొబ్బరిచెట్టు" ఇండియా నుండి తెప్పించుకుని చదివాను.
 
చిన్నప్పటి జ్ఞాపకాలు, జీవితంలోని సుఖాలూ దుఖ్ఖాలూ, ఆనందాలు, అవమానాలు అన్నీ కలెగలిపి కవి తనదంటూ వో ప్రత్యేకమైన లోకాన్ని నిర్మించుకుంటాడు. ఆ లోకానికి అతడే రాజు, రైతు. నలుమూలల్లో ఏం జరిగినా స్పందిస్తాడు. ఆనందమైనా విశాదమైనా తన గుండె చప్పుడుతో లోకం వెన్ను తట్టుతాడు. ఆ లోకంలో ఏ మూలా వదలకుండా అందరి బతుకులు కాంతివంతం చేసే కవిత్వాన్ని పండిస్తాడు. నట్టెండలో దుక్కి దున్ని రాత్రంతా చేనుకు నీళ్ళు పెట్టె రైతులా, పగలూరాత్రులను పద్యాలుగా మలిచి గుడిసె చుట్టూ పొగాకు తోరణాలు కట్టినట్టు లోకం చుట్టూ కవిత్వపు తోరణాలు కడతాడు. ఆ నిరంతర కృషి లో ఎంతో కొంత సాంత్వన పొందినా పూర్తి తృప్తి కలగదు. ఏదో వొక రోజు తను నిర్మించుకున్న ఆ లోకాన్ని నిట్టనిలువునా కూల్చేస్తాడు. వక్కలుచెక్కలైన ఆ శిధిలాల్లో తనని తానూ వెదుక్కుంటూ/కనుక్కుంటూ కనుమరుగై వొక పుస్తకంలో జనిస్తాడు. అయినా తృప్తి కలగదు. వెంటనే మరో కొత్త లోకాన్ని నిర్మించుకుంటాడు.

హెచ్చార్కె గారు తన "వానలో కొబ్బరిచెట్టు" ముందు మాటలో అన్నట్టు "పుస్తకమయిపోవడమంటే రచయిత చనిపోవడమే"... నిజమే! మరో కొత్త లోకాన్ని సృష్టించి మరో పుస్తకంలో చనిపోయేవరకు!
పొద్దు పొడుపు రోజూ పొడిచేదే. అయినా పొడిచిన ప్రతీ సారి మనల్ని ఏదో వొక కొత్త కోణంలో తాకుతుంది. బతకడానికి కావలసిన జీవిత రాహస్యాన్ని వొంపుతుంది. వో కవి రాసే కవిత్వం కూడా అంతే. ఒక్కో పద్యం ఒక్కో పొద్దుపొడుపు. "వానలో కొబ్బరిచెట్టు" లోని పద్యాలు కూడా ఇలాంటి కోవకు చెందినవే. ఒక్క పొద్దుపొడుపుతో ఒడిసిపోయే కథగాదు ఈ కాలానిది. ఒక్క పద్యంతో నిండిపోయే జీవితం కాదు ఈ కవిత్వానిది. కాలంలా కవిత్వం కూడా తనను తాను విస్తృతం చేసుకుంటూ దిక్కులు దూసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. కవులు పాళీ చెక్కుకుంటూ కవిత్వం ముందు నడుస్తూనే ఉంటారు.
వానలో కొబ్బరిచెట్టు సంకలనంలోని మొదటి (టైటిల్) పద్యం లో హెచ్చార్కె గారు ఇలా అంటారు:
"నాయనాన్ని పంపించు; రెప్పలు గట్టిగా మూసుకున్న దాన్ని.
వేణువును పంపించు; నిద్దట్లో మెలుకువ బాణీ తెలిసిన దాన్ని."
ఈ రెండు మాటలతో మనల్ని మెడిటేషన్ లోకి పంపించి, జీవితం చేసే సవ్వడులు వినిపిస్తూ/చూపిస్తూ, ఈ సంకలనంలోని ఏభై ఒక్క కవితా చినుకులతో మనల్ని తడిపేస్తారు.
ఇదే కవితలో మరో చోట
"తనను తాను సరిగ్గా చూసుకోడు గాని,నీరు మనిషి మొదటి అద్దం." అంటారు.
నిజమే, నీరు మనిషి మొదటి అద్దం.  సంకలనంలోని పద్యాలు కూడా అద్దం ముక్కల్లా మొదట మన జ్ఞాపకాలను, జీవితాన్ని చూపిస్తాయి. కొద్దిగా దృష్టి నిలిపి చూస్తె కవిని చూపిస్తాయి. ఇంకాస్త ధ్యానంతో చూస్తె మొత్తం ఈ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.
నట్టెండలో చెప్పుల్లేకుండా మైళ్ళు నడిచిన జ్ఞాపకమేదో వచ్చిఉంటుంది అందుకే ఇదే పద్యంలో ఇంకో చోట
"ఎండాకాలం రెండూళ్ళ మధ్య
చుక్క నీటి కోసం అలమటిస్తావు." అంటారు.
రాయి రాయి రాసుకుంటున్నాయి కవిత చదివినప్పుడు, ఇది అచ్చంగా మా రాళ్ళ చేను గురించే రాసినట్టే అనిపించింది. కవి కవిత్వీకరించిన తన అనుభవాన్ని చదివిన అందరూ ఇది నా అనుభూతే అని అనుకుంటే ఆ కవిత నిజంగా వెయ్యేళ్ళు బతికినట్టే. "రాళ్ళ చేనిలో గుంటక తోలే రైతుతో మట్టి గురించి మాట్లాడకు" అంటూ ఆ పద్యం మొదలవుతుంది. నిజమే. "చాళ్ళు చాళ్ళుగా తీర్చిన మట్టిని మొరటు వేళ్ళతో మీటి" పది మంది కడుపు నింపే రైతుతో మట్టి గురించి పెద్దగా మాట్లాడేదేముంటుంది. "రాళ్ళ గురించి, రాళ్ళ కింది మట్టి పొరల గురించి, గుండె అరల గురించి, తరతరాల చెరల గురించి మాట్లాడు" అంటారు.

వీధి, ‘శరీర రేఖలు అనే కవితలలో-
"మనసులు విప్పి మాట్లాడుకోకనే ఇంతింత శబ్దాలు.
మనుషులుగా కనిపించకనే ఇన్నిన్ని చర్మాలు." అంటారు.
నిజమే! ఈ కాలంలో జీవించడమంటే నటించడమే. నటిస్తూ నటిస్తూ మనిషి తన సహజత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. మాటల్ని తూకంలో వేసి మాట్లాడుతుంటాము. ఇలా ఆచీతూచడంలో మాట్లాడదల్చుకున్న మాటలు మారిపోతున్నాయి. లోపల ఎండిపోతే తడి మాటలెలా వస్తాయి? పైమినుకు మాటల ఇరుకుల్లో ఊపిరాడక గింజుకుంటూ కాలం గడిపే మనకు మన శరీర రేఖలు సరిహద్దులైనందుకు కవి పడే బాధ ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 'చెంచు కుర్రాడు' కవితలో లోకం పోకడ గురించి చెబుతూ కుండ బద్దలు కొట్టినట్టు "మర్నాటికి మాయమయ్యే కాసులు కొన్ని జేబులో పోసుకుని నావంతు మోసం నేనూ చేద్దామని బయల్దేరుతాను" అంటారు.

హెచ్చార్కె గారి కవిత్వంలో అస్తిత్వ వేదన, తాత్విక చింతన తో బాటు వెంటాడి నిలదీసి గుచ్చిగుచ్చి ప్రశ్నించే గుణం కూడా ఉంటుంది. ఈ సంకలనం లోని పద్యాలు కొన్ని మనల్ని జ్ఞాపకాల్లా చుట్టుముట్టి రొద పెడ్తే, మరికొన్ని జీవితానికి కావలసిన సారాన్ని నూరిపోస్తాయి. ముఖ్యంగా, పల్లెటూళ్ళో పుట్టి పెరిగినందుకేమో, మోదుగు ఆకు దొప్పల్లోంచి రంగులేని స్వచ్చమైన నీరు వొంపినట్టుగా వుంటుంది ఆయన కవిత్వం. దాపరికాలేమీ ఉండవు ఆ పద్యాల్లో. తల్లి కోడి రెక్కల్లోంచి తల చిట్లించి చూసే పిల్ల కోడిపాపల అమాయకత్వం కనిపిస్తుంది ఆ కవిత్వంలో. అట్లాగే నట్టెండలో నాగలి దున్నుతున్న రైతు, మనుమరాలి కళ్ళలో తనను తానూ కనుక్కునే వో తాతా కనిపిస్తారు. కాగిన చెంప మీద తొలకరి చినుకులా వానలో కొబ్బరిచెట్టు లోని కవిత్వం ఎండిపోయిన గుండెను తడిపేస్తుంది.

Thursday, April 21, 2011

"అనేక" మలుపుల మేలు కలయిక!

ప్రపంచీకరణ నేపద్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆర్ధిక అసమానతలు పెరిగాయి. కొత్త వాదాలు, కొత్త ఉద్యమాలు పాదుకుంటున్నాయి. మారిపోతున్న కాలంలో మానవీయ విలువలు, సంభందాలు మారుతున్నాయి. కవిత్వం కూడా కాలానికి తగినట్లుగా మారుతూ రావాలి. కవులు ఈ మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని, సమాజాన్ని అన్ని కోణాల నుండి దర్శిస్తూ సమాజపు గొంతుకను కవిత్వం ద్వారా వినిపించాలి, వినిపిస్తున్నారు కూడా. ఇది మనకు అఫ్సర్, వంశీకృష్ణల సంపాదకీయంలో వచ్చిన ‘అనేక పదేళ్ళ కవిత్వం’ చదివితే పోయిన పదేళ్ళలో కవిత్వం కూడా ఎన్ని మలుపులు తిరిగిందో ఖచ్చితంగా తెలుస్తుంది.
2000 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు తెలుగు సమాజంలో కవిత్వం తిరిగిన మలుపులను దాదాపు 200 మంది కవుల గొంతుకలలో వినిపిస్తూ, ఈ సందర్భాలనన్నిటిని చరిత్రగతిలో మరుగున పడకుండా 'అనేక' సంకలనం ప్రచురించడం కోసం అఫ్సర్, వంశీకృష్ణలు పడ్డ శ్రమ వృధా కాలేదు. ఈ పదేళ్ళలో, సమాజంలో చోటుచేసుకున్న అసమానతలు, అనేక విధాలైన అస్తిత్వ వాదాలుగా రూపు దిద్దుకుంటున్న నేపద్యంలో, వెయ్యి ముఖాలుగా విస్తరించిన కవిత్వ అస్తిత్వవేదనను బలంగా అభివ్యక్తికరిస్తూ, ఈ అనేక కొత్త గొంతుకలు చెప్పే కొత్త కొత్త విషయాలు మనల్ని తన్మయత్వంలోకి తోస్తూనే మనలో ఆలోచనలు రేకిత్తిస్తాయి. ఈ పదేళ్ళలో కవిత్వం సమాజంలోని స్థితిగతుల్ని స్పృశిస్తూ ప్రపంచీకరణ నీడలో అభ్యుదయ ప్రేరకమై, సమాజహితకరం అయి సాగిందా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఈ సంకలనంలో దొరుకుతుంది.

"ప్రతి మలుపు దగ్గరా కవులు కవిత్వ సాధనం పనితీరుని పరీక్షించుకుంటారు. అది ఎంతవరకు కొత్త వాస్తవికతను పట్టుకోగలదన్నశోదనలో పడతారు. పాత రచనా ధోరణి ఇంకే మాత్రం పనికి రావటం లేదన్న సందిగ్దం నుంచి ఈ శోధన మొదలవుతుంది. ఈ ప్రయత్నం కేవలం కవిత్వాన్ని మార్చే ప్రయాస మాత్రమే కాదు. తక్షణ వాస్తవికతను కవిత్వీకరించాలన్న తపన మాత్రమే కాదు. ఆ వాస్తవికతను ఎంతో కొంత మార్చాలన్న తపనా, ప్రయత్నం కూడా అందులో వుంటాయి." అంటున్న సంపాదకుల వాదన కొట్టి పడేసేది కాదు. సమాజాన్ని మార్చాలన్న తపన, ప్రయత్నమూ కొత్త గొంతుకలోచ్చిన ఈ కవుల కవితల్లో స్పష్టంగా వినిపిస్తుంది.

సాధారణంగా సంకలనానికి రాసే ‘ముందు మాట’ సంకలనంలోని వస్తువు పరిధిని నియంత్రించి పాఠకుడి ఊహా శక్తికి కూడా పరిధిలు నిర్ణయిస్తుంది అంటారు. కాని అఫ్సర్, వంశీకృష్ణలు రాసిన 'ప్రపంచీకరణ నీడలో పదేళ్ళు' వ్యాసం పాఠకుల ఆలోచన పరిధుల్ని మరింత విస్తరింపజేసి కొత్త చర్చకి నాంది పలికే విధంగా వుంది. ఈ పదేళ్ళలో వచ్చిన మేలు/మూల మలుపుల గురించి చెప్పడమే కాకుండా, ఆ మలుపులు కొత్త సందర్భంలో ఎలా వోదుగుతాయో చెప్పడం వల్ల చర్చకి కావలసిన అనుకూలమయిన వాతావరణాన్ని ఈ ముందు మాట కల్పిస్తోంది.

అనేక లో వివిధ విభాగాల కింద కవితలు కూర్చడం మంచి ఆలోచన. ఈ విభాగాలు కవిత్వ తీవ్రతని చెబుతూనే, కవిత తాత్వికత వైపు మన ద్రుష్టి మల్లిస్తాయి. "అతడు - ఆమె", "ఆవలి తీరం" లాంటి విభాగాలు నిజంగా వొక తాజాదనాన్ని ఇస్తున్నాయి.

‘అనేక’ సంకలం చరిత్రలో మొదటి సారి డయాస్పోరా రచయితలకు పెద్ద పీట వేసింది అనేది మనకు ఈ సంకలనం లో అధికంగా కనిపించే విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కవుల కవితలు చూస్తే అర్ధమైతుంది. 'ఆవలి తీరం' భాగంలోని కవితల్లో డయాస్పోరా కవుల భావావేశం మరియు ప్రపంచీకరణ మనిషి జీవితంలో సృష్టించిన అయోమయం కనిపిస్తుంది. 'అక్కడేం లేదంట' అనే కవితలో కే.సి చేకూరి, "నా సెంటు సీసాలు, వాచీలు ఎవరికి అక్కర్లేదిప్పుడు/నీక్కావాలంటే చెప్పు ఇక్కడో వెయ్యిగజం ఉంది చౌకలో/నేను ముందున్నట్లా వెనకపడ్డట్లా?" అని అయోమయ పడతాడు. అలాగే వినీల్ కుమార్ 'గుర్తుందా గోదారీ' అంటూ గోదారి మీద బెంగెట్టుకుంటాడు.

ఈ సంకలనంలోని కవితలని ఏడు ప్రధానమైన భావనలుగా క్షితిజలంబంగా వర్గీకరించినా, ఈ ఏడు వర్గాలను స్పృశిస్తూ- ప్రపంచీకరణ, IT రంగం, వలసలు, ఉద్యమాలు, స్థానికత, ప్రవాస వేదన ఇలా ఇంకెన్నో అంశాలు ముఖ్య వస్తువులుగా క్షితిజసమాంతరంగా ఈ సంకలమంతా ప్రవహిస్తూ మన ఆలోచనల్ని పదునె క్కిస్తుంటాయి. పదేళ్ళ కవిత్వాన్ని ఇలా భాగాలుగా విభజించి ప్రతి విభాగంలో ఇమిడే అర్ధవంతమైన కవితలను ఏరి కూర్చటం ఏమాత్రము సాధారణమైన విషయం కాదు.

ఈ సంకలనం అఫ్సర్ గారి కవిత 'పద్యం పుట్టుక గురించి' పద్యం కోసం ఆరాటపడుతూ మొదలై కౌముది గారి 'మీకోసం నేనో పద్యం రాస్తాను' తో ముగుస్తుంది. సంకలనం మొదటి భాగం 'అక్షరం'లో, పద్య జాడల కోసం పరితపిస్తూ తమ హృదయాంతరాల్లో ఉన్న కవిత్వపు ఉనికిని ప్రశ్నించుకుంటూ కవిత్వాన్ని మళ్లీ నిర్వచించుకుంటున్న కవుల గుండె చప్పుళ్ళు పినిపిస్తాయి. రెండవ బాగం 'అనుభవం' లోని కవితల్లో, వాస్తవానికి దగ్గరగా అనుభవాన్ని అనుభవంగా యధాతదంగా చిత్రీకరించడానికి కవులు ఉపయోగించిన పద చిత్రాలు మనకు మాటలకందని అనుభూతిని మిగులుస్తాయి. మూడవ భాగం 'అస్తిత్వం' లోని కవితల్లో సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక ఆందోళనల గొంతు వినిపిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పధం కనిపిస్తుంది. ఈ విభాగంలోని కవితలు చదువరి అస్తిత్వ పరిధులు కూడా విస్తరింపజేసి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. 'ఆందోళన' విభాగంలోని కవితల్లో కవి జనజీవన స్రవంతిలో మమేకమై సమాజం లోని వాస్తవికతను మనతో ఏకరువు పెడుతున్నట్టుగా ఉంటుంది. 'మనం కోరుకునే శాంతి/గుండె చప్పుడుకు, తుపాకి మొనకు మధ్య/ఊగిసలాడుతుంది' అంటూ, యాకూబ్ కవి 'రేషన్ లో శాంతిని ఈ రాజ్యం ఎంత కేటాయిస్తే/అంతే సంచిలో తెచ్చుకోవాలి.' అని వాపోతాడు.

మిగతా విభాగాల్లోని కవితల్లో ఆందోళన, ఆవేదన, ఆవేశం, ప్రగతిశీల భావనలతో పాటు పాఠకుడి హృదయంతరాలల్లోకి వాడిగా చొచ్చుకుపోయే కవితాత్మ కనిపిస్తుంది. ఎస్. రవికుమార్ 'స్థితి' అనే కవితలో 'జీవితం అనేక దృశ్యాలుగా మారినప్పుడు/కాలం మిగిల్చిన కన్నీటి/కథలను పేర్చుకోవడం తప్ప/రేపటి కోసం ఎదురుచూపు ఉండదు' అంటూ ఆందోళన చెందుతాడు.

చివరగా,

కవులు తమ కలాలను కాలాలకు అనుగుణంగా ప్రతీ మలుపు దగ్గర సానబట్టుకుంటూ, సమకాలీన పరిస్తితులకు దర్పనమై జీవితాన్ని అన్నికోణాల నుండి చూస్తూ, సమాజానికో దిక్కూ, దిశా నిర్దేశించే దిశగా కదులుతున్నారని ఈ సంకలనం నిరూపిస్తుంది. అంతేకాకుండా ఈ పదేళ్ళలో తెలుగు సాహిత్యం తన ఉనికిని తనే ప్రశ్నించుకుంటూ అస్తిత్వ స్పృహతో పూర్తి పరిపూర్ణత సంతరించుకుని కొత్తపుంతలు తొక్కుతున్నది అన్నది కూడా ఈ సంకలనం ద్వారా తెలుస్తుంది.

-రవి వీరెల్లి
(ఈ వ్యాసం పుస్తకం.నెట్ లో పబ్లిష్ అయింది)
http://pustakam.net/?p=6691