Tuesday, September 18, 2012

ఒక్కో పద్యం ఒక్కో పొద్దుపొడుపు

"రాయడం అనే పని మానవ మాత్రులు చేసేదే, నేను మానవుడిని గనుక నేనూ రాయగలనని..."
మొన్నీమధ్య పొద్దు అంతర్జాల పత్రికలో వచ్చిన వొక ఇంటర్వ్యూ లో హెచ్చార్కె గారు చెప్పిన మాట ఇది. ఎంత మంచి మాట! కొత్తగా రాయాలనుకునే వాళ్లకు కావలసినంత inspiration దొరుకుతుంది ఈ మాటల్లో. ఈ ఇంటర్వ్యూ చదివాక హెచ్చార్కె గారి పద్యాలు మరిన్ని చదవాలనే కోరిక పుట్టి  మధ్యే "వానలో కొబ్బరిచెట్టు" ఇండియా నుండి తెప్పించుకుని చదివాను.
 
చిన్నప్పటి జ్ఞాపకాలు, జీవితంలోని సుఖాలూ దుఖ్ఖాలూ, ఆనందాలు, అవమానాలు అన్నీ కలెగలిపి కవి తనదంటూ వో ప్రత్యేకమైన లోకాన్ని నిర్మించుకుంటాడు. ఆ లోకానికి అతడే రాజు, రైతు. నలుమూలల్లో ఏం జరిగినా స్పందిస్తాడు. ఆనందమైనా విశాదమైనా తన గుండె చప్పుడుతో లోకం వెన్ను తట్టుతాడు. ఆ లోకంలో ఏ మూలా వదలకుండా అందరి బతుకులు కాంతివంతం చేసే కవిత్వాన్ని పండిస్తాడు. నట్టెండలో దుక్కి దున్ని రాత్రంతా చేనుకు నీళ్ళు పెట్టె రైతులా, పగలూరాత్రులను పద్యాలుగా మలిచి గుడిసె చుట్టూ పొగాకు తోరణాలు కట్టినట్టు లోకం చుట్టూ కవిత్వపు తోరణాలు కడతాడు. ఆ నిరంతర కృషి లో ఎంతో కొంత సాంత్వన పొందినా పూర్తి తృప్తి కలగదు. ఏదో వొక రోజు తను నిర్మించుకున్న ఆ లోకాన్ని నిట్టనిలువునా కూల్చేస్తాడు. వక్కలుచెక్కలైన ఆ శిధిలాల్లో తనని తానూ వెదుక్కుంటూ/కనుక్కుంటూ కనుమరుగై వొక పుస్తకంలో జనిస్తాడు. అయినా తృప్తి కలగదు. వెంటనే మరో కొత్త లోకాన్ని నిర్మించుకుంటాడు.

హెచ్చార్కె గారు తన "వానలో కొబ్బరిచెట్టు" ముందు మాటలో అన్నట్టు "పుస్తకమయిపోవడమంటే రచయిత చనిపోవడమే"... నిజమే! మరో కొత్త లోకాన్ని సృష్టించి మరో పుస్తకంలో చనిపోయేవరకు!
పొద్దు పొడుపు రోజూ పొడిచేదే. అయినా పొడిచిన ప్రతీ సారి మనల్ని ఏదో వొక కొత్త కోణంలో తాకుతుంది. బతకడానికి కావలసిన జీవిత రాహస్యాన్ని వొంపుతుంది. వో కవి రాసే కవిత్వం కూడా అంతే. ఒక్కో పద్యం ఒక్కో పొద్దుపొడుపు. "వానలో కొబ్బరిచెట్టు" లోని పద్యాలు కూడా ఇలాంటి కోవకు చెందినవే. ఒక్క పొద్దుపొడుపుతో ఒడిసిపోయే కథగాదు ఈ కాలానిది. ఒక్క పద్యంతో నిండిపోయే జీవితం కాదు ఈ కవిత్వానిది. కాలంలా కవిత్వం కూడా తనను తాను విస్తృతం చేసుకుంటూ దిక్కులు దూసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. కవులు పాళీ చెక్కుకుంటూ కవిత్వం ముందు నడుస్తూనే ఉంటారు.
వానలో కొబ్బరిచెట్టు సంకలనంలోని మొదటి (టైటిల్) పద్యం లో హెచ్చార్కె గారు ఇలా అంటారు:
"నాయనాన్ని పంపించు; రెప్పలు గట్టిగా మూసుకున్న దాన్ని.
వేణువును పంపించు; నిద్దట్లో మెలుకువ బాణీ తెలిసిన దాన్ని."
ఈ రెండు మాటలతో మనల్ని మెడిటేషన్ లోకి పంపించి, జీవితం చేసే సవ్వడులు వినిపిస్తూ/చూపిస్తూ, ఈ సంకలనంలోని ఏభై ఒక్క కవితా చినుకులతో మనల్ని తడిపేస్తారు.
ఇదే కవితలో మరో చోట
"తనను తాను సరిగ్గా చూసుకోడు గాని,నీరు మనిషి మొదటి అద్దం." అంటారు.
నిజమే, నీరు మనిషి మొదటి అద్దం.  సంకలనంలోని పద్యాలు కూడా అద్దం ముక్కల్లా మొదట మన జ్ఞాపకాలను, జీవితాన్ని చూపిస్తాయి. కొద్దిగా దృష్టి నిలిపి చూస్తె కవిని చూపిస్తాయి. ఇంకాస్త ధ్యానంతో చూస్తె మొత్తం ఈ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.
నట్టెండలో చెప్పుల్లేకుండా మైళ్ళు నడిచిన జ్ఞాపకమేదో వచ్చిఉంటుంది అందుకే ఇదే పద్యంలో ఇంకో చోట
"ఎండాకాలం రెండూళ్ళ మధ్య
చుక్క నీటి కోసం అలమటిస్తావు." అంటారు.
రాయి రాయి రాసుకుంటున్నాయి కవిత చదివినప్పుడు, ఇది అచ్చంగా మా రాళ్ళ చేను గురించే రాసినట్టే అనిపించింది. కవి కవిత్వీకరించిన తన అనుభవాన్ని చదివిన అందరూ ఇది నా అనుభూతే అని అనుకుంటే ఆ కవిత నిజంగా వెయ్యేళ్ళు బతికినట్టే. "రాళ్ళ చేనిలో గుంటక తోలే రైతుతో మట్టి గురించి మాట్లాడకు" అంటూ ఆ పద్యం మొదలవుతుంది. నిజమే. "చాళ్ళు చాళ్ళుగా తీర్చిన మట్టిని మొరటు వేళ్ళతో మీటి" పది మంది కడుపు నింపే రైతుతో మట్టి గురించి పెద్దగా మాట్లాడేదేముంటుంది. "రాళ్ళ గురించి, రాళ్ళ కింది మట్టి పొరల గురించి, గుండె అరల గురించి, తరతరాల చెరల గురించి మాట్లాడు" అంటారు.

వీధి, ‘శరీర రేఖలు అనే కవితలలో-
"మనసులు విప్పి మాట్లాడుకోకనే ఇంతింత శబ్దాలు.
మనుషులుగా కనిపించకనే ఇన్నిన్ని చర్మాలు." అంటారు.
నిజమే! ఈ కాలంలో జీవించడమంటే నటించడమే. నటిస్తూ నటిస్తూ మనిషి తన సహజత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. మాటల్ని తూకంలో వేసి మాట్లాడుతుంటాము. ఇలా ఆచీతూచడంలో మాట్లాడదల్చుకున్న మాటలు మారిపోతున్నాయి. లోపల ఎండిపోతే తడి మాటలెలా వస్తాయి? పైమినుకు మాటల ఇరుకుల్లో ఊపిరాడక గింజుకుంటూ కాలం గడిపే మనకు మన శరీర రేఖలు సరిహద్దులైనందుకు కవి పడే బాధ ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 'చెంచు కుర్రాడు' కవితలో లోకం పోకడ గురించి చెబుతూ కుండ బద్దలు కొట్టినట్టు "మర్నాటికి మాయమయ్యే కాసులు కొన్ని జేబులో పోసుకుని నావంతు మోసం నేనూ చేద్దామని బయల్దేరుతాను" అంటారు.

హెచ్చార్కె గారి కవిత్వంలో అస్తిత్వ వేదన, తాత్విక చింతన తో బాటు వెంటాడి నిలదీసి గుచ్చిగుచ్చి ప్రశ్నించే గుణం కూడా ఉంటుంది. ఈ సంకలనం లోని పద్యాలు కొన్ని మనల్ని జ్ఞాపకాల్లా చుట్టుముట్టి రొద పెడ్తే, మరికొన్ని జీవితానికి కావలసిన సారాన్ని నూరిపోస్తాయి. ముఖ్యంగా, పల్లెటూళ్ళో పుట్టి పెరిగినందుకేమో, మోదుగు ఆకు దొప్పల్లోంచి రంగులేని స్వచ్చమైన నీరు వొంపినట్టుగా వుంటుంది ఆయన కవిత్వం. దాపరికాలేమీ ఉండవు ఆ పద్యాల్లో. తల్లి కోడి రెక్కల్లోంచి తల చిట్లించి చూసే పిల్ల కోడిపాపల అమాయకత్వం కనిపిస్తుంది ఆ కవిత్వంలో. అట్లాగే నట్టెండలో నాగలి దున్నుతున్న రైతు, మనుమరాలి కళ్ళలో తనను తానూ కనుక్కునే వో తాతా కనిపిస్తారు. కాగిన చెంప మీద తొలకరి చినుకులా వానలో కొబ్బరిచెట్టు లోని కవిత్వం ఎండిపోయిన గుండెను తడిపేస్తుంది.

No comments:

Post a Comment