Friday, October 17, 2014

ఎర వేయని గాలం!

ప్రతీ రోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యడు. పొగమంచుని అటూ ఇటూ ఊది నీటి అట్టడుగు పొరల్లోకి వేళ్ళు ముంచి చేపల్ని తట్టి నిద్ర లేపుతాడు.

నేనూ.. నా వెనకే అచ్చంగా నాలాగే నడుస్తూ వాడూ, చెరువొడ్డు చేరతాం. తపస్సు చేస్తున్న ఋషుల్లా ఒకరి వీపుకు మరొకరి వీపునానించి కాలానికే గాలం వేస్తున్నట్టు కూచుంటాం. నిశ్శబ్దాన్ని మోయలేక గాలి కూడా మాతో అలా చతికిలపడిపోతుంది కాసేపు. పండగకు ఇల్లుచేరిన పిల్లల్లా సందడి చేస్తూ, చేతన మరిచిన చెరువుకు కొత్త ప్రాణం పోస్తూ, చేప పిల్లలు రెండు జట్లుగా చీలిపోతాయి. అప్పటివరకు గలగలమన్న చెట్లు, ఆట మొదలయినట్టు గట్టు మీంచి నిశబ్దంగా తొంగిచూస్తూ నిన్చుంటాయి. జడ్జిల్లా గెలుపెవరిదో చెప్పడానికన్నట్టు చెట్ల మీద పిట్టలు కంటిపాపలను మాత్రమే కదిలిస్తూ క్యూరియాసిటీతో కూచునుంటాయి.

***

వాణ్ని గెలిపించడం కోసం కొన్ని చేపలు ఓడిపోతాయి. ఆట ముగుస్తుంది.

***

విన్నర్ ని డిక్లేర్ చేస్తున్నట్టు పిట్టలు రెక్కలతో టపటపా చప్పట్లు కొడుతూ పైకి లేస్తాయి. అందరి విజయాలను తనే క్లెయిమ్ చేసుకుని టై లూస్ చేసుకుంటూ ఊపిరితిత్తుల నిండా వెలుగునంతా పీల్చుకుని పడమటికి ప్రయాణమైతాడు సూర్యడు.
బుట్ట నిండా చేపలతో మా వాడు, ఖాళీ బుట్టతో నేను ఇల్లుచేరతాము. చేపల పులుసుకు మసాలా నూరుతూ ఓడిపోయి గెలిచిన నాన్నను చూసి అమ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది.

***

నేను గాలానికి ఎరవేయకుండా గట్టుమీదే వదిలేసిన ఎరలన్నీ ఆ రాత్రి వాటి వాటి మట్టిగూళ్ళలోకి మెల్లగా ప్రయాణమవుతాయి.

No comments:

Post a Comment