Saturday, December 22, 2012

నీ పేరున ఒక నక్షత్రం!


తూరుపు మీటిన వెలుగుతీగ మీంచి
అందంగా సింగారించుకుని దిగిన
ఓ వేకువ రాగం
గుట్ట చెంపలు నిమిరి
చెట్టు ఆకులు వెలిగించి
మట్టి చెవుల్లో మంత్రమై మోగి
రికాం లేని గాలి నోట్లో
రోజంతా నానింది.

ఆగి చూడ్డానికి తీరికెక్కడిది?!

ఒక గది నుండి మరో గదికి
ఆ గది నుండి ఇంకో గదికి…

మూసుకున్న తలుపు చేసే మూగ రోదన
తెరుసుకున్న తలుపు చెప్పే తియ్యని మాట
వినిపించుకోడానికి తీరికెక్కడిది?
తుదిలేని తొవ్వ కొమ్మకు పూసే దృశ్యాలు
కళ్ళ బుట్టలో దాచుకోడానికి చోటెక్కడిది?!
మనసునిండా ముసురుకున్న మార్మిక రాగాలు
తనివితీరా పలికించుకోడానికి తీరికెక్కడిది?

ఒక గడప నుండి మరో గడపకి
ఒక దారి నుండి ఇంకో దారికి…

పాడె ఎక్కడైనా లేవచ్చు

'హే రాం' అనుకునే తీరికెక్కడిది?

నింగీ నేలా కలిసే చోటుకి
నిన్ను నడిపిస్తూ నడిపిస్తూ
గమ్యం నీడల్లోకి ఇంకిపోయే వెలుగు
ఎప్పుడో ఒక రోజు
చైతన్యాన్ని చిటుక్కున కోసి
చీకటి వీలునామా విప్పుతుంది

ఓ నక్షత్రాన్ని
నీ పేర్న రాస్తుంది.

No comments:

Post a Comment