కాలం వో ఐదు జతల చీకటివెలుగుల్ని అవలీలగా మింగి, తన వీకెండ్ తలుపులు బార్లా తెరిచి, ఓ సారి ఒళ్ళు విరుచుకుంది. అమెరికాలో ఐదు రోజులు ఐదు సెకండ్లలా గడిచిపోతాయి, పిల్లలుంటే మరీను. వీకెండ్ రోజు కనీసం ఓ గంట సేపైనా ఎక్కువ నిద్రపోకపోతే జీవితంలో అతి విలువైనదేదో పోగొట్టుకున్నట్టు వెలితిగా ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా ఈ నిద్ర సుఖాన్ని పూర్తిగా అనుభవించాలనుకున్నా. కాని, అంత అదృష్టం ఎక్కడిది?! మా చిన్నోడు పొద్దున్నే లేచి కప్పుకున్న నా దుప్పటి లాగేసి "డాడా... ఈ రోజు నాయనమ్మ తాతయ్యల పెళ్లి రోజట, అమ్మ చెప్పింది. తొందరగా లే, తాతయ్యకు ఫోన్ చేద్దాం" అంటూ ఒకటే తొందర పెట్టాడు.
స్నానం చేసి కిచెన్ లో అడుగు పెట్టేసరికి మా ఆవిడ వేడివేడి చాయ్ కిచెన్ కౌంటర్ మీద రెడీగా ఉంచింది. నిగనిగలాడుతూ ఈ మధ్యే వేయించిన గ్రానైట్ కౌంటర్ అందంగా కనిపించింది. ఓ చేత్తో చాయ్ తాగుతూ రెండో చేత్తో ఇండియా లో ఉన్న నాన్నకు డయల్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాక, అమ్మా నేనూ కాసేపు మా ఊరు కబుర్లు చెప్పుకున్నాం.
"అమ్మా, ఈరోజు పెళ్లి రోజు కదా, బాపు నీకేమైనా గిఫ్ట్ కొనిచ్చాడా?" అని అడిగా.
"అసలు పెళ్లిరోజని యాదికుంటేగదరా" అని నవ్వింది అమ్మ.
"బాపు కొనివ్వకపోతేమాయే, నేను కొనిస్తా, ఏం కావాలమ్మా" అని అడిగా.
"ఆ.. ఏమద్దురా... మీరు గక్కడెక్కడో ఉన్నారన్న ఒక్క బాధ తప్ప మాకు పెద్దగా కష్టాలేం లేవు. బాపు నీకు చెప్పిండో లేదో కాని, మనూరి మీద ఇప్పుడు కోతులు రాజ్యమేలుతన్నయిరా. ఏన్నించి అచ్చినయో గాని, ఓ వంద కంటే ఎక్కువనే ఉంటయ్. ఓ రెండ్రోజుల్లో పోతయ్ లే అనుకున్నాం, గాని ఇప్పటికి యాడాదికి ఎక్కువనే అయింది. వీటితో పెద్ద తలకాయ నొప్పైపోయంది. పట్నం వొళ్ళ తరీక మేం ఎప్పటికి దర్వాజా మూసి కూసోం గదా. అందుకే ఇంట్లకచ్చి ఏది దొరుకుతే అదే ఎత్తుక పోతన్నయ్. ఏదన్న తిండి వస్తువ ఉంటే సాలు, ఎత్తుకపోవుడేనాయె. చిన్న పిల్లగాండ్లని సుత గోర్లతో గీకుతున్నాయ్. ఆఖరికి మన ఇంటెనుక కాసిన కాయగూరలు సుత ఉంచుతలేవు." అంటూ అమ్మ ఆవేదనగా చెప్పింది.
"నాలుగు తన్ని ఎల్లగొట్టక పోయిండ్రే" అని నవ్వుతూ సింపుల్ గా అన్నాన్నేను.
"అయ్యో.. కోతి దేవుడు. కొట్టి సంపద్దురా. పాపం తలుగుతది." అమాయకంగా అంది.
"అయితే జంతువులను తీసుక పోయి అడివిలో వదిలే గవర్నమెంటు ఆఫీసు ఉంటది. వాళ్లకు నేను చెప్పి చూస్తాను లే" అన్నాను.
"వాళ్లకు సుత సెప్పి సూసినం. ఏం లాబం లేదురా. ఈ కోతుల లొల్లి నుంచి మనూరికి ఏదైనా దారి సూపియ్యరా. " బతిమాలుతున్నట్టు అడిగింది.
పక్కనుండి ఇదంతా వింటున్న నాన్న "ఇగ నువ్వు వానికి చెప్పింది చాల్లే" అంటూ ఫోన్ లాక్కుని “అరేయ్ చిన్నోడా, నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న మనూరు గుట్ట…”
అంటూ చెప్పటం మొదలెట్టాడు.
నాన్న చెప్పిన మాటలు నన్ను చాలా డిస్టర్బ్ చేసాయి.

*
నల్ల గొంగడి కప్పుకుని, పచ్చగా నవ్వుతూ, అజానుభాహునిలా, నిటారుగా నిలిబడి ఊరుకు కాపలా కాసిన ఆ నల్ల గుట్ట ఇప్పుడు లేదట? పల్లెను కనీ, పెంచి, పెద్దదిక్కై నిలిచిన కొండ ఇక లేదట. పల్లె పల్లెంతా విష జ్వరాలతో పలవరించినపుడు, పచ్చని పసరాకు పంపిన కొండ, ఇప్పుడు లేదట. నేను పొట్ట చేతబట్టుకుని వలస పోయినట్టే, మా ఊరు గుట్టా, ఊరు విడిచి వెళ్లిపోయిందట. నే పిలిస్తే పలికి, నవ్వితే నవ్వే మా ఊరు నల్లగుట్ట, ఇప్పుడు పట్నం పెద్దిండ్లలో పెద్ద పెద్దోల్ల పాదాలు మోస్తుందట. మనసు బాగా లేనప్పుడు నన్ను రమ్మని, తన పొత్తిళ్ళలో పొదువుకునే ఆ కొండసొరికెలు కూలిపోయినయట. ఊరు ఊరంతా తలెత్తి గర్వంగా చూసే ఆ గుట్ట, ఇప్పుడు కాళ్ళు విరిగి కూలబడ్డదట.
ఎలా? ఏదో ఒకటి చేయాలి. పుట్టి పెరిగిన ఊరికి ఈ మాత్రం సహాయం చేయక పొతే ఈ జీవితం దండగ, అనుకుంటూ ఆలోచనలో పడ్డా. నాన్నకు నామీద బలమైన నమ్మకం. వీడు చదివిన చదువు ఇలానైనా ఊరుకు ఉపయోగపడాలి అనుకున్నాడేమో. కాని, నేను చదివిన చదువు ఒకటి, చేస్తున్న ఉద్యోగం మరోటి అని నాన్నకి తెలియదు. నాన్న ఎంతో ఇష్టంగా నన్ను సివిల్ ఇంజనీరింగ్ చదివించి, ‘ఎన్విరాన్మెంటల్’ లో ఎమ్మెస్ చేయించారు. కాని, కొన్ని కారణాలవల్ల నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడాల్సి వచ్చింది.
ఈ కోతుల సమస్య మొదట్లో చాలా చిన్నగానే అనిపించినా, సమస్యకు మూలం ఏమిటో తెలిసేసరికి అది ఎంతపెద్ద సమస్యో ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా అవగాహనకు వస్తుంది. అసలు ఈ పని నేను చేయగలనా, లేదా అన్న సందేహం కూడా కలగకపోలేదు. కాని చెయ్యాలి. ఏదో ఒకటి చేయాలి. ఎంతమంది సహాయం తీసుకుని అయినా సరే, చేయాలి.
ఈ విషయంలో ఎవరు సహాయం చేయగలరా అని ఆలోచిస్తే వెంటనే నాకు గుర్తుకొచ్చిన వాడు నా ప్రాణమిత్రుడు రామకృష్ణ.
రామకృష్ణ నాతోపాటే ఎమ్మెస్ చేసి ‘వరల్డ్ బ్యాంకు ఎన్విరాన్మెంట్ డిపార్టమెంట్’ లో ‘ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్’ గా పనిచేస్తున్నాడు. ఏడాదికి ఓసారి ఆఫీస్ పనిమీద అమెరికా వస్తుంటాడు. అలా, వాడు చేసే ప్రాజెక్ట్స్ మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ కోతుల సమస్యకి పరిష్కారం కొద్దిగా దొరికినట్టయింది.
వెంటనే ఢిల్లీలో ఉంటున్న రామకృష్ణకు డయల్ చేసాను.
ఫోన్లో కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, మెల్లగా నా అసలు సమస్య బయట పెట్టాను. విని "ఆర్ యు కిడ్డింగ్?" అని పెద్దగా నవ్వాడు.
"ఒక కొండను రీస్టోర్ చెయ్యాలి. దానికి నీ సహాయం కావాలి" మళ్ళీ ఇంకోసారి దృడంగా చెప్పాను.
"ఆర్ యు మాడ్? క్వారీయింగ్ చేసి గ్రానైట్ రాళ్ళను వెలికితీసి, పడగొట్టబడ్డ, ఓ ఎండిపోయిన కొండను మళ్ళీ రీస్టోర్ చేయడమా? చెట్టు పెట్టడం చూసా, కాని గుట్ట పెట్టడం వినటానికే విడ్డూరంగా ఉంది" అంటూ మళ్ళీ నవ్వబోయాడు. కాని నా గొంతులోని సీరియస్ నెస్ విని నవ్వాపుకున్నట్టున్నాడు.
"రీస్టోర్ అంటే… గుంతలు పూడ్చి, చిందరవందరగా పడున్న శిదిలాలను క్లీన్ చేయించడం పెద్దపనేం కాదు, కాని అన్ని చెట్లు నాటడం ఎలా? ఆ కొండను ఒక చిన్న అడవిలా ఎలా మార్చగలం?" అంటూ రామకృష్ణ తనలో తాను ఆలోచిస్తూ పైకే అన్నాడు.
రామకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం, అంతే కాదు గౌరవం కూడా. జాయిన్ అయిన మూడు సంవత్సరాల్లోనే ఎంతో విసిబిలిటీ ఉన్న వరల్డ్ బ్యాంకు రూరల్ ప్రాజెక్ట్స్ డివిషన్ కు మేనేజర్ అయ్యాడు. అతను మిజోరాం లో ఎక్షెక్యూట్ చేసిన ‘స్టెబిలైసింగ్ ల్యాండ్ స్లైడ్-ప్రోన్ హిల్ సైడ్స్’ అనే ప్రాజెక్ట్ కి మంచి గుర్తింపు వచ్చింది. నేననుకుంటున్న ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి, ప్లాన్నింగ్ చేయగలిగే సత్తా ఉన్నవాడు.
"రీస్టోర్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. ఏదైనా ఆల్టర్నెట్ సొల్యుషన్ ఆలోచించావా" అని అడిగాడు. "అన్నీ ఆలోచించా. ఎనిమల్ కంట్రోల్, ఫారెస్ట్ డివిజన్ వాళ్లకు చెప్పి కోతులను మైగ్రేట్ చేయించవచ్చేమో! కాని ఇది మా ఒక్క ఊరు సమస్యే కాదు. మా జిల్లా అంతటా ఉంది. అందుకే ఈ సొల్యుషన్ వర్క్ అవుట్ కాదు. సమస్య మూలాలను అన్వేషించి, గుర్తించి, వాటిని అధ్యయనం చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తేనే మంచిది. నిన్న జింకలు, ఈ రోజు కోతులు, రేపు పులులు ఇలా ఉండటానికి గూడు లేక అన్నీ అంతరించి పోవడమే కాకుండా ప్రజలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అందుకే జంతురాశి ఉనికికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం మన బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడంవల్ల ప్రజల్లో పర్యావరణంమీద అవగాహన పెరుగుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటి కూడా పెరుగుతుంది. ఇది జనాభా ఎక్కువగా ఉన్న మనలాంటి దేశానికి చాలా అవసరం.
గ్రానైట్ రాళ్ళు తీసిన కంపెని, వాళ్ళ పని అయిపోగానే ఎక్కడి గుంతలు అక్కడే వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారు కాబట్టి, అక్కడ మళ్ళీ బ్లాస్టింగ్ సౌండ్స్ వినిపించే అవకాశం లేదు. ఉండటానికి చెట్లు లేక, బ్లాస్టింగ్ సౌండ్స్ కి బెదిరి గుట్టను వదిలిన కోతులు, గుట్టను మనం మళ్ళీ పచ్చగా చేస్తే తప్పకుండా ఊరు వదలి వెనక్కి కొండకు వెళ్తాయి." కాన్ఫిడెంట్ గా అన్నాన్నేను.
"అది కాదురా, నేను ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి ఆలోచిస్తున్నాను" నెమ్మదిగా తన డవుట్ బయటపెట్టాడు రామకృష్ణ.
"ఈ పదేళ్ళ అమెరికా వాసం నాకు చాలా నేర్పింది. నాలుగైదు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వాలంటీర్ చేసాను. ఇక్కడున్న ప్రతీ ఒక్క ఎన్నారై తన దేశానికి ఏదో ఒక మంచిపని చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. మా కాలేజి అల్యూమిని ద్వారా మేము ప్రతీ ఏడాది ఏదైనా ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. ఫండ్స్ రేయిస్ చెయ్యడం పెద్ద పనేం కాదు. ప్రాజెక్ట్ డిజైన్ చెయ్యడానికి నువ్వెలాగూ ఉన్నావు. కాని నాటడానికి అన్ని మొక్కలు, ‘మాన్ పవర్’ ఎలా? మొక్కలు సర్వైవ్ కావాలంటే వాతావరణం కూడా మొదట్లో సపోర్ట్ చెయ్యాలి." అన్నాన్నేను.
"నాకు కొద్దిగా సమయం కావలి. దీన్ని ఎనలైస్ చేసి నీకు కాల్ చేస్తానురా” అంటూ రామకృష్ణ ఫోన్ పెట్టేసాడు.
*
నెల రోజుల తర్వాత… ఓ రోజు రామకృష్ణ దగ్గరినుండి మెయిల్ వచ్చింది. మెయిల్ కి అటాచిమెంటుగా ఓ యాభై పేజీల పైనే ఉన్న ప్రాజెక్ట్ ప్లాన్ పంపించాడు. ప్రాజెక్ట్ ఫీసిబుల్ అని రామకృష్ణ రాసిన రిపోర్ట్ చదివిన తర్వాత కాస్త కాన్ఫిడెన్సు వచ్చింది. అయితే, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.
ప్రాజెక్ట్ లో అన్నీటికంటే కష్టమైన పనులలో మొదటిది గ్రామప్రజలను ఒప్పించడం, రెండవది సహాయంచేసే వాలంటీర్స్ ను వెదకడం, మూడవది మొక్కలు పెంచే నర్సరీలను మనకు కావలసిన మొక్కలు పెంచమని ఒప్పించడం. ఇవన్నీటిని మించి, వరుణదేవుడు సహకరించాలి. అందుకే వచ్చే వర్షాకాలం మొదట్లో, మొదటి విడత ప్రాజెక్ట్ మొదలు పెడదామని అనుకున్నాము. ఫండ్స్ రేయిస్ చేయడానికి మా కాలేజి పూర్వవిద్యార్థులు ముందుకొచ్చారు. గ్రామప్రజలను ఒప్పిస్తే, మొక్కలునాటే పని కాస్త సులువు అవ్వచ్చు. నేను పనిచేస్తున్న ‘జెనరల్ ఎలక్ర్టిక్’ కంపెనీ హైదరాబాద్ బ్రాంచి వాలంటీర్లు ఇంతకు ముందు ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో మాకు సహాయపడ్డారు. వాళ్లకు కూడా ఈ ప్రాజెక్ట్ నచ్చి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
ఇంకేం… ఓ మంచిరోజు చూసుకుని మా ఊరికి బయలుదేరాను.
*
ఒక పెద్ద కొండ గుహలో నేను, ఒంటరిగా. గుహకు రెండు వైపులా పచ్చని కాయలతో, సీతాఫల్ చెట్లు. అక్కడికి ఎలా వచ్చానో కూడా తెలియదు. చిత్రంగా, ఆ గుహ నేను చిన్నప్పుడు ఆడుకున్న మా ఊరి గుట్టదే. పక్కనే పండిన సీతాఫల్ తింటూ ఓ కోతిపిల్ల. ఎందుకో గాని, ఎప్పుడూ చెట్ల కబుర్లు మోసుకొచ్చే పిట్ట ఈ రోజు రాలేదు. అంతలో సన్నటి విసిల్ శబ్దం వినివించింది.
ఎవరో విసిల్ ఊదుతున్నారు. మొదట్లో సన్నగా ఆ తర్వాత కాస్త లౌడ్ గా.
ఆ వార్నింగ్ శబ్దం ఏమిటో అర్ధమయ్యేసరికి ఒక్క సారిగా ఒళ్ళు జలదరించింది. వెంటనే గుహా నుండి బయటికి పరిగెత్తా. కాని అప్పటికే సమయం మించిపోయింది. పెద్ద విస్పోటం...
"ధన్.." భూమి ఒక్కసారిగా కంపించింది. వెంటనే వెనక్కి గుహలోపలికి పరుగుతీశా. గుహ పైనుండి పెద్దపెద్ద రాళ్ళన్నీ జారుతున్న శబ్దం. ఓ పెద్ద బండరాయి నేనున్న ఆ గుహను పూర్తిగా మూసేసింది. అంతా చీకటి.
ఈ చప్పుళ్ళకు భయపడ్డ కోతి నా తలపైకెక్కి కూర్చుంది. వెంటనే మరో పెద్ద బ్లాస్టింగ్.
గుహా కూలిపోతున్న దృశ్యం. రాళ్ళు నన్ను పాతరేస్తున్న దృశ్యం. గాయాలతో ఒళ్ళంతా రక్తం. "అమ్మా!" అంటూ పెద్దగా అరిచాను.
"ఆర్ యు ఆల్ రైట్?" అంటూ భుజాలను పట్టి కుదుపుతూ, నా కళ్ళ లోకి చూస్తూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్.
"ఆర్ యు ఆల్ రైట్?" అంటూ భుజాలను పట్టి కుదుపుతూ, నా కళ్ళ లోకి చూస్తూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్.
లండన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, టెర్మినల్ ఫైవ్, లాంజ్ చైర్ లో కూర్చుని పగటి కలలు కంటున్న నన్ను వో ఆఫీసర్ తట్టి లేపాడు.
"ఐ ఆమ్ పర్ఫెక్త్లీ ఆల్ రైట్. ఇట్ ఇస్ జస్ట్ ఎ డ్రీం" అంటూ సిగ్గుపడ్డాను. గత నెలరోజుల నుండి ఇలాంటి కలలు రావడం నాకు కొత్తేం కాదు. టైం చూసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళే బ్రిటిష్ ఎయిర్ వేస్ ఫ్లైట్ కు ఇంకా ఒక గంట టైం ఉంది.

"ఏందీ గుట్టకు చెట్లువెడుతవా? పిస్స గిట్ల లేసిందా?" ఇది నాకొచ్చిన మొదటి రెస్పాన్స్, అదీ గ్రామసభలో ఓ గంట చెట్ల అవసరం గురించి భాషన్ ఇచ్చాక కూడా.
కొద్దిగా నీరసం వచ్చింది. మళ్ళీ గొంతు సర్దుకొని మాట్లాడటం మొదలు పెట్టా.
"ఈ ప్రపంచం ఎలా పుట్టిందో తెలుసా?" అంటూ 'బిగ్ బ్యాంగ్' థీరి వాళ్లకు అర్థమయ్యేట్లు చెప్పుకుంటూ…
ఆదిమ మనిషి అవతరించినప్పటి నుండి నాగరికత ఎలాంటి మలుపులు తిరిగింది, ప్రపంచీకరణ నేపద్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కాలుష్యమూ ఎలా పెరిగింది, ఇవన్నీటికి తగ్గట్టు మనిషి మారుతూ తన మనుగడ కోసం ఎలా పోరాటం చేస్తున్నాడు. ఎండాకాలంలో చీమలు, వానాకాలం కోసం ఆహరం ఎందుకు దాచుకుంటాయో, మనం కూడా ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించుకుంటేనే రాబోయే కాలంలో మన పిల్లలు ఎలా సుఖంగా ఉంటారో చెప్పాను.
"సమాజంలో అందరూ ఇలాగే తమ వ్యక్తిగత స్వార్ధం చూసుకుంటే, మనిషి మనుగడకే అర్ధం మారి, ఈ ఊరు, ఈ ప్రపంచం ఇంకా ఎన్నో రోజులు నిలవదు." అంటూ ఓ క్షణం ఆగి,
"ఓ మల్లన్నా, నీకు ఎన్నెకరాల భూమి ఉందే?" అంటూ ఓ రైతు నడిగా.
"నాలుగెకరాలు ఉందయ్యా" అన్నాడు మల్లన్న.
"నువ్వు చిన్నగ ఉన్నప్పుడు అందులో ఎన్ని చెట్లు ఉండె?" అడిగాన్నేను.
"మా పొలం సుట్టూతా పడారిలా రెండు గజాల ఎడెల్పుతో యాప, రేగు, వాయిల్, చింత, పులిచింత, మోతుకు, దురిసేన గిట్ల ఎన్నో చెట్లు ఉండె."
"ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నయ్?" సూటిగా అడిగాన్నేను.
"ఓ రెండు పుట్లు ఎక్కువ పండుతయని గవన్నీ ఎప్పుడో కొట్టేసిన. గిప్పుడనిపిస్తది, పొలంపని చేసి గొడిసేపు నీడకు కూకుందామంటే ఒక్క చెట్టైనా లేకపాయే"
“ఇలా అందరూ ఏదో ఒక వంకతో అన్ని చెట్లు కొట్టేసిండ్రు. అందుకే చెట్లమీద ఉండే కోతులు మీ ఇళ్ళ కప్పుల మీద కాపురం చేస్తన్నయ్. మీ పిల్లల్ని రక్కుతున్నయ్. మీకు తెలుసో తెలువదో గని, ఒక చెట్టు మనకు కనపడని ఓ వెయ్యి జీవులుకు ఇల్లు. మన అత్యాశ వల్ల మన మనుగడకే కాకుండా జంతువుల మనుగడకూ ముప్పుతెస్తున్నాము. ఈ మధ్య టి.వి లో చూస్తున్నారు గదా, పులులు ఇళ్ళ మీదికి ఎలా దూసుకొస్తున్నాయో!.”
ఏం అర్థం అయ్యిందో కాని కొంతమంది నిజమే నిజమే అంటూ నాకు సపోర్ట్ గా మాట్లాడారు.
హమ్మయ్య.. కొంత మందినైనా కన్విన్సు చెయ్యగలిగా.
అలా అనుకున్నానో లేదో మరో అడ్డంకి ఈసారి రాజకీయం రూపంలో వచ్చి పడింది.
మా ఊర్లో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ చేసే పనిని ఇంకో పార్టీ అస్సలు సమర్ధించదు, ఆ పని నిజంగా ఊరుకు ఉపయోగపడేదే అయినా సరే. రెండవ పార్టీని ఒప్పించటానికి నేను కూడా రాజకీయం రంగు వేసుకోవలసివచ్చింది.
ఎలాగైతేనేం, అందర్నీ ఒప్పించి మర్నాడు మా జిల్లాలో ఉన్న మొక్కలు పెంచే నర్సరీలతో కూడా ఒప్పందం కుదుర్చుకొని అమెరికా తిరుగు ప్రయాణమయ్యాను.

కాలం గద్ద మూడేళ్లను ముక్కున కరచుకొని ముందుకు దూసుకెళ్లింది.
ఈ మూడేళ్ళలో మూడుసార్లు మా ఊరు వెళ్ళోచ్చా. మొదటి విడత గుట్టపై నాటిన మొక్కలు ఎండకు మిడతల్లా మాడిపోయాయి. రెండవ సంవత్సరం అప్పుడప్పుడు కొద్దిగా వర్షాలు పడ్డా, నీరు పల్లం లోకి జారడంవల్ల మొక్కలకు చేరలేదు. అందుకు వర్షపు నీరు ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి గుట్టపైన అక్కడక్కడ పెద్ద కందకాలు తవ్వాల్సి వచ్చింది. మూడవ సంవత్సరం, వర్షాకాలంలో వర్షాలు పడటంవల్ల కొన్ని మొక్కలు దక్కితే, మరికొన్ని మొక్కలు ఊర్లో ఉన్న మేకల కడుపులు నింపాయి.
ఇట్ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్.
నా కిచెన్ లో వేసిన గ్రానైట్ కౌంటర్ మాత్రం నన్ను రోజూ వెక్కిరిస్తూనే ఉంది.
*
"అరేయ్ చిన్నోడా మనూరికి 'గ్రీన్ విలేజ్' అవార్డ్ వచ్చిందటరా" అంటూ ఓ రోజు నాన్న కాల్ చేసాడు.
"మన గ్రీన్ గుట్ట ప్రాజెక్ట్ సూపర్ డూపర్ ఫెయిల్ అయింది కదా బాపు, అయినా 'గ్రీన్ విలేజ్' అవార్డు రావటం ఏమిటీ?" కాస్త ఆశ్చర్యంతో అడిగాను.
"పోయిన పదేండ్లలో మనకు తెలువని కొన్ని సంగతులు జరిగినయిరా. ఎవరు నింపిన చైతన్యమో మరేందో కాని, ఊరి జనాలు చాలా మారిపోయిండ్రు. రైతులు గుట్ట ప్రాజెక్ట్ కు సాయం చేసినప్పుడు, మనకు తెలువకుండా మరో పని కూడా చేసిండ్రు. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు కొన్ని ఊరు బయట వాళ్ళ పొలాల చుట్టూ నాటుకుని, స్వంత బిడ్డల్లా కాపాడుకున్నారు. ఇప్పుడు అవి పెరిగి పెద్దగయినయ్. ఊరు పొలిమేర పచ్చగా మారింది. గుట్టకు దక్కిన కొన్ని పళ్ళ చెట్ల కారణంగానో, పొలాల చుట్టూ పెరిగిన చెట్ల కారణంగానో, కోతులు కూడా చాలా వరకు ఊర్లోకి రావడం తగ్గించాయి." సంతోషంగా చెప్పాడు నాన్న.
*
ఉపసంహారం:
దేశం పచ్చగా ఉండాలంటే ముందుగా మనుషుల మనసులు చిగురించాలి. అప్పుడే.. ఏ పల్లైనా, ఏ పట్నమైనా, ఈ మొత్తం ప్రపంచమైనా పచ్చగా మారేది. ఈ దేశానికి చెట్ల అవసరంతో పాటు గుట్టల అవసరం కూడా ఎంతో ఉంది. వక్కలు చెక్కలవుతున్న గుట్టలు దక్కించుకోవాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ చెయ్యటానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు పల్లెలకు సహాయం చెయ్యాలి.
అంతరిక్షంలో ఉందొ లేదో తెలియని మరో నేల కోసం ఎందుకు ఆ ఆరాటం.
రండి… మనల్ని మనం నాటుకుని, చిగురించి, ఈ నేల తల్లికి చల్లని నీడనిద్దాం.
***
(వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 17వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో "నా మొట్టమొదటి కథ" విభాగంలో బహుమతి పొందిన కథ)
***
(వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 17వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో "నా మొట్టమొదటి కథ" విభాగంలో బహుమతి పొందిన కథ)
No comments:
Post a Comment