Sunday, August 28, 2011

ఏ పుట్టుకా వద్దు!

అప్పుడు:
ఆకారం లేదు
అవధులు అసలే లేవు.
పాలపుంతల దారి
నా కొలమానం.
ఆకాశపుటంచులనూ
పాతాళపు లోతులనూ
ఏకకాలంలో స్పృశించే
రెక్కతొడిగిన స్వేచ్ఛ-
తొమ్మిది గ్రహాల ముంగిలి
నా అస్తిత్వం.

ఇప్పుడు:
తొమ్మిది తలుపుల చర్మపు చెరసాలలో
ఊపిరి పోసుకున్న జీవిత ఖైదీ.

వింతేమిటంటే..
ఈ జైలుకు రక్షకుణ్ణి, శిక్షకుణ్ణి,
శిక్షను అనుభవించే ఒంటరి పక్షినీ నేనే.

అనుబంధాల గొలుసులతో బంధించి
కోరికలతో సల సలా మరుగుతున్న స్వార్ధాన్ని
నర నరాల్లోకెక్కించడం
ఇక్కడ విధించబడుతున్న శిక్ష.

నషాళానికెక్కిన ఆశల జెండాలతో
సింగారించుకుంటున్న ఈ గోడలు
ఇంకెన్నాళ్ళు?

ఉచ్చ్వాస నిశ్వాసలకు
జరిగే యుద్ధంలో
ఏదో ఒకరోజు
ఏదో ఒకటి గెలవటమూ
ఈ జైలు తలుపులు
బద్దలవటమూ తప్పదు.

సమయయంత్రం ముద్రించే
చరిత్ర పుటల్లోకెక్కాలనుకోవడమే
నా స్వార్ధం అయితే
నాకే చరిత్రా వద్దు
ఏ పుట్టుకా వద్దు.

అవధుల్లేని స్వేచ్ఛ నివ్వు.

*

No comments:

Post a Comment