Monday, August 8, 2011

మరిచిన చిరునామా

అనుబంధాల వేళ్లను తెగ నరుక్కొని
గ్లోబలైజేషన్ అరువిచ్చిన వలస రెక్కలు తొడుక్కొని
దూరాలను దూసుకుంటూ
ప్రవాసులుగా ఎక్కడో పాదుకున్నాము.

విడిచోచ్చిన నేల జననానికి మన దేశమైనా
భవిష్యత్తుతో భేటి మరే దేశంలో రాసుందో?

తోడోచ్చిన కన్నీళ్లు
తీరాల మధ్య దూరాలు కోలుస్తుంటే
సంపాదన సాంత్వననిస్తుందా?

దూరాలను చెరిపేసే శక్తి సన్నగిల్లినప్పుడు
ఆత్మీయంగా తారసపడే వారు ఎవ్వరూ ఉండరు.

తెంపుకొచ్చిన పేగు బంధాన్ని
దాటుకోచ్చిన అనుబంధాలను
ఖననం చేసి కట్టుకున్న
ఈ ప్రవాసపు పునాదులు
ఎప్పటికైనా పెగలాల్సిందే.

గడించిన లోకానుభవం చాలు
ప్రయాణించిన దూరాలు చాలు
ఆగని కాలంతో పరుగుపందెం రోజూ ఉండేదే

ఒక్కసారి
ఆగిన జ్ఞాపకాలతో ముఖా ముఖి చేయి
పూర్తిగా రీవైండ్ అయిన మనసు చెబుతుంది
నువ్వు మరిచిన
నీ శాశ్వత చిరునామా ఏమిటో.

సుజనరంజని జూన్ సంచికలో ప్రచురితమైన కవిత.

No comments:

Post a Comment