ఏవీ
నీకన్నా ముందే
నీ రాకని లయగా మోసుకొచ్చే
నీ కాలిపట్టీల కూనిరాగాలు?
ఏవీ
నీలాకాశం చీర చివర
వెన్నెల జీరాడినట్టుండె
తెల్లలంగా కుచ్చులు?
ఏదీ
నీ ఉనికిని ఇష్టంగా
గాలిపల్లకిలో ఊయలూపుతూ మోసుకొచ్చే నీ పరిమళం?
ఎందుకు
ఎప్పుడూ మన చూపుల సయ్యాటల్లో దూరలేక సిగ్గుపడి పరిగెత్తే సమయం
ఇప్పుడు నీ కంటి కొత్త భాషకు అర్ధం తెలీక నివ్వేరపోతుంది?
గుప్పెడంటే గుప్పెడు మల్లె మొగ్గల్లో మత్తుగా విచ్చుకునేవి ఆ రోజులు.
గుంగిలి పూల బోకేల్లో మూగగా ముడుచుకుంటూ ఈ రోజులు.
అవే
వెలుగుకళ్ళ ఎదురుచూపుల పగళ్ళు.
అవే
చీకటి వలేసిపట్టి ఒక్కటిచేసే రాత్రులు.
రోజులేం మారలేదులే!
ఇప్పటికీ
భూమి వెనక్కి తిరిగి చీకటి కొప్పు ముడుసుకుంటే
ఆకాశం ప్రేమగా వెన్నెల పూలు తురుముతుంది.
ఇక దూరాలంటావా?
పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నప్పుడు
దూరాన్ని అమాంతం మింగే
నీ ఒకే ఒక తియ్యని పిలుపు చాలదూ!
ప్రియా
దూరాల్ని పోత పోస్తూ పోత పోస్తూ
పాత పాటని మరిచిన రోజులను
మళ్ళీ గొంతెత్తి పాడనీ…
రెండు గదుల మధ్య
వెలిసిపోయిన ఈ పాత పరదాకు
కలిసి కొత్త రంగులద్దనీ…
వాకిలి పత్రికలో: http://vaakili.com/patrika/?p=741
No comments:
Post a Comment