Friday, October 17, 2014

హోంకమింగ్

శబ్దాలన్నీ వాటి వాటి గూళ్ళలో ముడుచుకున్నాక
దేహకమండలంలో కాసిన్ని నిశ్శబ్దపు నీళ్ళు నింపుకుని
నువ్వు నాటుకుంటూ వెళ్ళిన ఆ బుల్లిబుల్లి మాటల వెనకే
నువు నేర్పిన ఆ పాత మంత్రాన్నే కొత్తగా జపిస్తూ వెళ్తాను.

వెళ్తున్న దారిలో
నీ పాదాల గుర్తులు మాయమయినదగ్గర
నీ పరిమళం ఆనవాలు పట్టుకుని అయినా సరే
నాకు నేను కనిపించనంతవరకూ వెళ్తాను.

లోకం అంటే నచ్చక కాదు
శబ్దాలంటే ఇష్టం లేక కాదు
దూరాల్ని ఛేధించాలనీ కాదు
నువ్వేంటో కనుక్కోవాలనీ కాదు

వెళ్తూ వెళ్తూ నువు నాటుకుంటూ వెళ్ళిన ఆ చిన్ని మాటలు
తిరిగొచ్చే లోపు పొద్దుదిరుగుడు పూలవ్వడం చూడ్డానికి
వెళ్తూ వెళ్తూ నువు చిలకరించుకుంటూ వెళ్ళిన నీ పరిమళం
తిరిగొచ్చే దార్లో మిణుగురుపురుగులవ్వడం చూడ్డానికి
వెళ్తూ వెళ్తూ నువు అద్దిన పాదాల అచ్చులు
దారి చీరకు వెన్నెల కుచ్చుల్లా మెరవడం చూడ్డానికి

అవును
తిరిగి రావడానికే
నానుండి నేను దూరంగా వెళ్తాను.

నేనిలాగే!

ఎడమచేత్తో “ఆకాశం బరువు దించి”
కుడిచేతి చూపుడువేలు మీద భూమిని గిరగిరా తిప్పుతూ
నువ్వలా మౌనంగా వెళ్తుంటావే
తరిగి చూడని నదిలా
పాలిచ్చి మరిపించి వెళ్ళిన తల్లిలా.

నీ మౌనం విస్తీర్ణం కొలవడానికే అనుకుంటా
విశ్వంలోని గ్రహాలన్నీ ఇంకా అలా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాయి.

ఇవన్నేవీ పట్టకుండా
నువ్వలాగే వెళ్తుంటావు.

నేనిలాగే
నాలో నేనే మొలకెత్తి
వసంతాన్నై పూసి
గ్రీష్మాన్నై తపించి
శిశిరాన్నై రాలి
వెలుగుతూ ఆరుతూ
పదానికి పదానికి మధ్య ఋతువులా కరిగిపోతూ..

నా ప్రపంచానికి
క్షణానికో సరికొత్త పొలిమేరై పుట్టే
నీ పాదముద్రలేరుకుంటూ..

నేనిలాగే!

ఎర వేయని గాలం!

ప్రతీ రోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యడు. పొగమంచుని అటూ ఇటూ ఊది నీటి అట్టడుగు పొరల్లోకి వేళ్ళు ముంచి చేపల్ని తట్టి నిద్ర లేపుతాడు.

నేనూ.. నా వెనకే అచ్చంగా నాలాగే నడుస్తూ వాడూ, చెరువొడ్డు చేరతాం. తపస్సు చేస్తున్న ఋషుల్లా ఒకరి వీపుకు మరొకరి వీపునానించి కాలానికే గాలం వేస్తున్నట్టు కూచుంటాం. నిశ్శబ్దాన్ని మోయలేక గాలి కూడా మాతో అలా చతికిలపడిపోతుంది కాసేపు. పండగకు ఇల్లుచేరిన పిల్లల్లా సందడి చేస్తూ, చేతన మరిచిన చెరువుకు కొత్త ప్రాణం పోస్తూ, చేప పిల్లలు రెండు జట్లుగా చీలిపోతాయి. అప్పటివరకు గలగలమన్న చెట్లు, ఆట మొదలయినట్టు గట్టు మీంచి నిశబ్దంగా తొంగిచూస్తూ నిన్చుంటాయి. జడ్జిల్లా గెలుపెవరిదో చెప్పడానికన్నట్టు చెట్ల మీద పిట్టలు కంటిపాపలను మాత్రమే కదిలిస్తూ క్యూరియాసిటీతో కూచునుంటాయి.

***

వాణ్ని గెలిపించడం కోసం కొన్ని చేపలు ఓడిపోతాయి. ఆట ముగుస్తుంది.

***

విన్నర్ ని డిక్లేర్ చేస్తున్నట్టు పిట్టలు రెక్కలతో టపటపా చప్పట్లు కొడుతూ పైకి లేస్తాయి. అందరి విజయాలను తనే క్లెయిమ్ చేసుకుని టై లూస్ చేసుకుంటూ ఊపిరితిత్తుల నిండా వెలుగునంతా పీల్చుకుని పడమటికి ప్రయాణమైతాడు సూర్యడు.
బుట్ట నిండా చేపలతో మా వాడు, ఖాళీ బుట్టతో నేను ఇల్లుచేరతాము. చేపల పులుసుకు మసాలా నూరుతూ ఓడిపోయి గెలిచిన నాన్నను చూసి అమ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది.

***

నేను గాలానికి ఎరవేయకుండా గట్టుమీదే వదిలేసిన ఎరలన్నీ ఆ రాత్రి వాటి వాటి మట్టిగూళ్ళలోకి మెల్లగా ప్రయాణమవుతాయి.

బయల్దేరాలిక…

నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మ కింద
ఎప్పుడో రాలే ఆ ఒక్క పువ్వు కోసం
కదలకుండా ఎదురు చూస్తున్న కోనేటిమెట్టులా
పిలుపుకు పడిగాపులు కాస్తూ
ఎన్నాళ్ళు?!

ఎన్నో దేహాల్ని పవిత్రం చేసి
పచ్చగా నవ్వుతున్న కాలం కోనేట్లోకి
పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయి బిళ్ళను గిరాటేసా.

పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి
పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని శృతి చేసుకుంటూ
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని

విడిది పడవ వదిలి
వెళ్ళాలిక

సలపరించే ఆలోచనల్ని బుక్కపోసి
భావాల నొప్పిని పుక్కిలిస్తూ
నా నీలోంచి
ఉవ్వెత్తున ఎగిసే ప్రేమకెరటాల్ని ఈదుకుంటూ…

కాటగలిసిన దిక్కుల్ని ఒక్కటి చేయడం కోసం
తన నీడకు తానే నిప్పంటించుకుని తరలివెళ్ళే సూర్యునిలా
లోలోన ఘనీభవించిన చైతన్యంలోకి
తపస్సుకు బయల్దేరాలిక…

నదితో నాలుగడుగులు

1
మలుపు మలుపులో
మరో కొత్త పాటకు స్వరం దిద్దుకుంటూ
మంద్రంగా
సాగిపోతుంది నది.

రెప్పపాటి రోజుల్లా
ఒక్కొక్కటిగా ఒడ్డు చేరి నిష్క్రమించే
అలలు లెక్కిస్తూ కూర్చున్నా.

జవాబు చెప్పే లోపే ప్రశ్న మార్చే జీవితంలా
ఒకటి రెండై
రెండు నాలుగై
లెక్క తేలని అలలలలు.

2
రోజూ చదివే పుస్తకమేకదాని
బడికెళ్ళడం మానడుగా!
పుట మారుస్తూ
పొలిమేరల్లో సూర్యుడు.

కట్టు బట్టల్ని గుట్టపైనే వదిలేసి
నగ్నంగా నది నీట్లోకి దూకుతూ
సన్నటి ఈరెండ.

జారుతున్న పుప్పొడిపైటను సరిచేసుకుంటూ
గాలి విల్లు వొంచి
పరిమళాన్ని ఎక్కుపెట్టి
దిక్కులన్నీటిని ఒక్కొక్కటిగా చిత్తుచేస్తూ
కొమ్మ చివరంచుల్లో
ఓ పువ్వు.

3
నది గలగలా పాడే పాటలన్నీటికీ
నేనే బాణీ కట్టానంటూ
కొమ్మెక్కి కొండతో వాదిస్తుందో కొంటె కోయిల.

కొండకున్న
ఓపికా
స్థిరత్వం
కోయిల కెక్కడిది!

మత్తెక్కిన దిక్కుల్ని
మలిసంజకి వదిలేసి
కోయిలా
నేనూ
ఎవరి గూట్లోకి వాళ్ళమే.

4
పాపం!
తల్లి పొత్తిళ్ళలో మళ్ళీ పుట్టడానికి
జీవితాంతం పరిగెత్తే నది
పుట్టు అనాధ.


(వర్జీనియా లోని శనండొహా పిల్లనదితో ఓ రోజు)

*** అమెరికాలో(మేమున్న ప్రదేశంలో) కోయిలలు లేవు కానీ ఇక్కడి Northern Mockingbird అనే పిట్టనే అమెరికన్ కోయిల అంటారు. ఇది మన తెలుగు కోయిల అంత మధురంగా పాడదు కానీ మన కోయిల కంటే చాలా పొడుగు పాటలు పాడి ఊదరగొడుతుంది.

Saturday, February 23, 2013

మొదటి వాక్యం

అంతరంగాన్ని అతలాకుతలం చేసే
నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు-
ఆక్షరాలు
ప్రేమగా అలాయ్ బలాయ్ ఇచ్చుకోవు.

ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య
నించోనే నిద్రపోతున్న కుంచెను చూసి
ఫక్కుమని నవ్వి వెక్కిరిస్తాయి
నెత్తి కెక్కిన కొన్ని అనుభవాలు.

అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు
బయటికిరాలేని ఒకానొక బలహీనత ఒళ్ళో
బద్ధకం
ఏకాయెకి పరుపుబండై
కాళ్ళుసాపుకు పడుకుంటది.

శబ్దానికి మరో శబ్దానికి మధ్య
ఎప్పుడూ ఎంకిలా ఎదురుచూసే
నిశ్శబ్దం
ముఖం చాటేస్తది.

రాత్రంతా సోపతున్న
ఈస్ట్ మన్ కలర్ కల
అంజాన్ కొడుతూ
వెనక్కి తిరిగి సూడకుండా వెళ్ళిపోతది.

గుండె
అమ్మ లేని ఇల్లవుతది.

*

ఎత్తుకున్న బరువంతా
దింపుడుకల్లంలో దించుకునేవరకు
ఎన్నో కొన్ని దినాలు
ఆకారం లేని ఆ ఆకారాన్ని
ఉప్పుడు బస్తాలా మొయ్యాలి.

***

సరే…
మొదటి వాక్యం రాయి
రెండో వాక్యం తోడొస్తుంది.

నీ రక్తం పంచి
నీ గొంతుకిచ్చి
నిజాన్ని నిజంగా చూపించే పిడికెడు వెలుగు పూసి
ముచ్చటగా మూడో వాక్యం
కూడా…



వాకిలి పత్రికలో: http://vaakili.com/patrika/?p=1213