Sunday, August 28, 2011

ఏ పుట్టుకా వద్దు!

అప్పుడు:
ఆకారం లేదు
అవధులు అసలే లేవు.
పాలపుంతల దారి
నా కొలమానం.
ఆకాశపుటంచులనూ
పాతాళపు లోతులనూ
ఏకకాలంలో స్పృశించే
రెక్కతొడిగిన స్వేచ్ఛ-
తొమ్మిది గ్రహాల ముంగిలి
నా అస్తిత్వం.

ఇప్పుడు:
తొమ్మిది తలుపుల చర్మపు చెరసాలలో
ఊపిరి పోసుకున్న జీవిత ఖైదీ.

వింతేమిటంటే..
ఈ జైలుకు రక్షకుణ్ణి, శిక్షకుణ్ణి,
శిక్షను అనుభవించే ఒంటరి పక్షినీ నేనే.

అనుబంధాల గొలుసులతో బంధించి
కోరికలతో సల సలా మరుగుతున్న స్వార్ధాన్ని
నర నరాల్లోకెక్కించడం
ఇక్కడ విధించబడుతున్న శిక్ష.

నషాళానికెక్కిన ఆశల జెండాలతో
సింగారించుకుంటున్న ఈ గోడలు
ఇంకెన్నాళ్ళు?

ఉచ్చ్వాస నిశ్వాసలకు
జరిగే యుద్ధంలో
ఏదో ఒకరోజు
ఏదో ఒకటి గెలవటమూ
ఈ జైలు తలుపులు
బద్దలవటమూ తప్పదు.

సమయయంత్రం ముద్రించే
చరిత్ర పుటల్లోకెక్కాలనుకోవడమే
నా స్వార్ధం అయితే
నాకే చరిత్రా వద్దు
ఏ పుట్టుకా వద్దు.

అవధుల్లేని స్వేచ్ఛ నివ్వు.

*

స్టిల్ లైఫ్

తెల్లటి అందాలు పరిచి
ప్రియుని కోసం
ఎదురు చూస్తూన్న ప్రేయసిలా
కాయితం.

ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
వొంగి క్యూరియాసిటీ వెదజల్లుతూ
టేబుల్ ల్యాంపు.

పాళీ చెక్కుకుంటూ
నేను.

*

మూలన
మౌనంగా
ముగింపు లేని కథను నెమరేసుకుంటూ
చెత్తబుట్ట.

Tuesday, August 9, 2011

ఆవృత్తి

విశ్వం నుండి
రెక్కలు విరిచి
భూమ్మీదకు విసిరేయబడ్డ
ఓ రంగుల కల
నేను.
*
జీవితపు కనురెప్పల కొన
ఉదయించి ఊగిసలాడే
కలల బిందువులు
ఏ రంగయితేనేం
ఉప్పగా 
రేపటిలోకి ఇంకి పోవాల్సిందే.
*
కల పగిలి
ఎప్పుడు భళ్ళున తెల్లారిందో...
కొత్త రెక్కలతో
అస్తిత్వపు మూలాలు వెతుక్కుంటూ
తిరిగి విశ్వాంతరాల్లోకి
నేను.

Monday, August 8, 2011

జ్ఞాపకాల ధార


కుండలో పొంగిన
నురగను తీసేసినట్టు
వేసుకున్న బంధాలన్నీ
తీసేసి వచ్చాను.

ఇక్కడ
ఏ బీర్ బాటిల్లోంచి
                              పొంగే నురగ చూసినా-  
                              తాటాకు రాకెలో
                              సన్నని ధారలా
                              జాలువారే
                              జ్ఞాపకాలు.

                              జ్ఞాపకాల ధారను నియంత్రించే
                              తాటినార ఫిల్టర్ను మాత్రం
                              నా చిన్ననాటి స్నేహితుడి దగ్గరే మరచా!

I miss my village and friends.

జీవితం

మొదట్నుంచి
చివరి వరకు రాసి
'అండూ' చేయబడ్డ
ఓ వర్డ్ డాక్యుమెంట్
జీవితం.

క్షణానికో మారు
'రీడూ' బటన్ నొక్కేది
సమయం అనే
మాక్రో.

జ్ఞాపకం

నీ జ్ఞాపకం కరిగి
ఎప్పుడు
గుండె లోతుల్లోంచి ప్రవహించి
కన్నీరై చేతివేళ్ళ నుండి రాలిందో!

అలుక్కుపోయిన
అక్షరాలతో
తడి తడిగా
ఓ కావ్యం.