Saturday, January 10, 2015

చీకటి వంతెన చివర









యుద్ధం ముగిసింతర్వాత
అక్కడేం మిగిలుండదు.
నెత్తురోడిన కత్తులు చీకటి ఒరల్లోకి
ఒద్దికగా ఒదిగిపోతాయి.
నుదుటి కుంకుమ చెరిపేసుకున్న ఆకాశం
దిగులు కాన్వాసుపై గీసిన ఒంటరి మేఘంలా
తీరం లేని శూన్యాన్ని ఈదుతూ ఉంటుంది.
మోరలెత్తి నుంచున్న శిఖరాలన్నీ
అదాటున లోయలుగా మారుతుంటాయి.
రెప్పల పిడికిట్లో చూర్ణం అయిన రంగులన్నీ
చీకటి ప్రవాహంలో కలిసిపోతుంటాయి.
ఒంటిమీద కంటి పడవలన్నీ తెరచాపలెత్తి
కలల అలల్లో తునిగిపోతుంటాయి.

ఆమె మాత్రం
ఎప్పట్లాగే
చీకటి పుల్లకు లోకాన్ని గుచ్చి
రేపటి నిప్పుకణికలమీద కాల్చడానికి
వ్యూహరచన చేస్తూంటుంది.