Saturday, February 23, 2013

మొదటి వాక్యం

అంతరంగాన్ని అతలాకుతలం చేసే
నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు-
ఆక్షరాలు
ప్రేమగా అలాయ్ బలాయ్ ఇచ్చుకోవు.

ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య
నించోనే నిద్రపోతున్న కుంచెను చూసి
ఫక్కుమని నవ్వి వెక్కిరిస్తాయి
నెత్తి కెక్కిన కొన్ని అనుభవాలు.

అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు
బయటికిరాలేని ఒకానొక బలహీనత ఒళ్ళో
బద్ధకం
ఏకాయెకి పరుపుబండై
కాళ్ళుసాపుకు పడుకుంటది.

శబ్దానికి మరో శబ్దానికి మధ్య
ఎప్పుడూ ఎంకిలా ఎదురుచూసే
నిశ్శబ్దం
ముఖం చాటేస్తది.

రాత్రంతా సోపతున్న
ఈస్ట్ మన్ కలర్ కల
అంజాన్ కొడుతూ
వెనక్కి తిరిగి సూడకుండా వెళ్ళిపోతది.

గుండె
అమ్మ లేని ఇల్లవుతది.

*

ఎత్తుకున్న బరువంతా
దింపుడుకల్లంలో దించుకునేవరకు
ఎన్నో కొన్ని దినాలు
ఆకారం లేని ఆ ఆకారాన్ని
ఉప్పుడు బస్తాలా మొయ్యాలి.

***

సరే…
మొదటి వాక్యం రాయి
రెండో వాక్యం తోడొస్తుంది.

నీ రక్తం పంచి
నీ గొంతుకిచ్చి
నిజాన్ని నిజంగా చూపించే పిడికెడు వెలుగు పూసి
ముచ్చటగా మూడో వాక్యం
కూడా…



వాకిలి పత్రికలో: http://vaakili.com/patrika/?p=1213